పాలకుర్తి : మండలంలోని పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని యునాని వైద్యశాలను(Unani Hospital) ఇతర ప్రాంతాలకు తరలించే కుట్ర జరుగుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. హాస్పిటల్‌ను యధావిధిగా ఇక్కడే కొనసాగాలని హాస్పిటల్ డాక్టర్ సాయి కిరణ్‌కు వినతి పత్రం అందించారు. 20 ఏళ్లుగా పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేలాది ప్రజలు వైద్య సేవలు పొందుతున్నట్లు వారు పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యున్ని జిల్లా కేంద్రానికి డిప్యూటేషన్ చేయించి ఇక్కడి హాస్పిటల్‌ను సైతం ఇతర ప్రాంతాలకు తరలించేలా చూస్తున్నారని పేర్కొన్నారు.
ఆరోగ్య కేంద్రం పరిధిలోని కుక్కల గూడూరు, గుడిపల్లి, జయారం, రామారావు పల్లె తదితర గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడే వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి యునాని కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని గ్రామానికి చెందిన నాయకులు వేల్పుల రాజ్ కుమార్, సురేష్ కుమార్ తదితరులు డిమాండ్ చేశారు.