కోల్ సిటీ, అక్టోబర్ 25 : గోదావరిఖని గాంధీ నగర్లో గల ఎండీహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్రానికి మంగళవారం పలువురు చేయూత అందించారు. స్థానిక సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులు జె.అజయ్ బాబు- ప్రియాంక దంపతుల వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఆశ్రమాన్ని( Orphanage) సందర్శించారు. రూ.12 వేల విలువగల క్వింటాలు బియ్యం తోపాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఎంతోమంది అనాథ పిల్లలను చేరదీసి వారికి తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా పెంచి పెద్ద చేస్తున్న ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్యను అభినందించారు.
ఆశ్రమానికి తమవంతుగా సహాయం చేయాలని భావించి సహాయం అందించామని పేర్కొన్నారు. మున్మందు కూడా ఈ ఆశ్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆ దంపతులకు ఆశ్రమం తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్థానిక పవర్ హౌస్ కాలనీకి చెందిన ఎన్. స్వరూప తన తల్లి జ్ఞాపకార్థం ఆశ్రమానికి 25 కిలోల బియ్యం, పండ్లు అందజేశారు. తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. వేరువేరుగా జరిగిన కార్యక్రమాలలో ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య, పిల్లలు పాల్గొన్నారు.