ఓదెల, జూన్ 23: పెద్దపల్లి జిల్లా కొలనూర్-పెగడపల్లి డబుల్ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది. రోడ్డుపై గుంతలు (Potholes) ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆర్అండ్బీ అధికారులు స్పందించడం లేదు. కొలనూర్-పెగడపల్లి గ్రామాల మధ్య రేగడి మద్దికుంట నుంచి ఏడాది క్రితం డబుల్ రోడ్డు నిర్మించారు. అయితే ఈ రోడ్డులో అనేక చోట్ల తారు కొట్టుకుపోవడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నెలలు గడుస్తున్నా ఆర్ అండ్ బీ అధికారులు వాటిని పూడ్చడం లేదని, తాము ప్రమాదాల బారినపడి తరచూ గాయపడుతున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లను వెంటవెంటనే గుర్తించి ప్రమాదాలు జరగకుండా మరమ్మతులు చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదని వాహనదారులు వాపోతున్నారు. కొలానూర్-పెగడపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై పడిన గుంతలు, దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.