పెద్దపల్లి : ఎంతో కష్టపడి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేస్తే.. నేడు తమ బిడ్డలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు రామగుండం పోలీస్ కమీషనర్(Police Commissioner) శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన గుజ్జుల సాయిలు, చిలకమ్మ అనే దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. అయితే ఆస్తులు పంచుకొని తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెద్దకొడుకు మల్లికార్జున్ ఆర్మీలో ఉద్యోగం చేస్తుండగా చిన్న కొడుకు రమేష్ విద్యుత్ శాఖలో లైన్న్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇద్దరు కొడుకులకు భూమిని సైతం రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చామన్నారు. భూమి కొనడానికి 10 లక్షల రూపాయలు అప్పు చేశామని, ఇప్పుడు మేము అప్పు కట్టే పరిస్థితిలో లేమని, మా గురించి పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం నిత్య అవసరాల నిమిత్తం ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. స్పందించిన సీపీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వృధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంటు ఓ చట్టాన్ని రూపొందించిందన్నారు. వృద్ధ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం, మెయింటెనన్స్ యాక్ట్ 2007 (Maintenance Act 2007)పేరుతో దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. కేంద్రం రూపొందించిన చట్టానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో నిబంధనలు రూపొందించారు. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.