Godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 21: అడవి బిడ్డల హక్కుల కోసం నాటి ప్రభుత్వంతో పోరాడి ప్రాణాలర్పించిన ఆదివాసీ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆదివాసీ లను అంతమొందించి అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలని ప్రజా సంఘాల నాయకుడు పుట్ట రాజన్న డిమాండ్ చేశారు.
గోదావరిఖని మార్కండేయ కాలనీలో గల స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఇంద్రవెల్లి అమరవీరుల వర్ధంతి సభను సోమవారం నిర్వహించారు. ముందుగా అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుట్ట రాజన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లిలో 1981లో జరిగిన ఆ చీకటి రోజుకు నేటికి 44 ఏళ్లు గడిచిందని, అమరుల కుటుంబాలను గుర్తించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కుల కుమ్రం భీం, రాంజీగోండ్ స్ఫూర్తితోనే పోరాడారని గుర్తు చేశారు.
జాతి కోసం పోరాడి అమరులైన వారికి నివాళులర్పించి చేతులు దులుపుకోకుండా ఆ కుటుంబాలకు న్యాయం చేసినప్పుడే నిజమైన నివాళి అని అన్నారు. అడవులను నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీల ఊచకోత కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మారణ హోమంను న్యాయ నిపుణులు, మేధావులు, ప్రజా సంఘాలు తక్షణమే ఖండించి కాల్పుల విరమణ అమలయ్యేలా శాంతియుత పోరాటం చేయాల్సిన అవసరముందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాశిపేట లక్ష్మీనారాయణ, కే శ్రీనివాస్, భాస్కర్, రమేష్, బాలరాజ్, రవి, చారి తదితరులు పాల్గొన్నారు.