పెద్దపల్లి రూరల్, జూన్ 13: పెద్దపల్లి (Peddapally) నియోజకవర్గంలోని పెద్దపల్లి, ఎలిగేడు మండలాల్లో నూతనంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఆయా ఠాణాలను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రెండు స్టేషన్లకు అధికారులు (ఎస్ఐ), సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది.
నూతనంగా మంజూరైన పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పురుషోత్తం (Purushottam), పెద్దపల్లి రూరల్ ఎస్ఐగా మల్లేశ్, ఎలిగేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా సత్యనారాయణను నియమించారు. పురుషోత్తం ప్రస్తుతం రామగుండం ఎస్ బి లో పనిచేస్తున్నారు. రూరల్ ఎస్ఐగా నియమితులైన మల్లేశ్ (Mallesh) ప్రస్తుతం పెద్దపల్లి ఠాణాలో ఎస్ఐ 2గా పని చేస్తున్నారు. ఎలిగేడు ఎస్ఐగా నియమితులైన సత్యనారాయణ (Satyanarayana) ప్రస్తుతం మంచిర్యాల వీఆర్‌లో పనిచేస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత రెండు రోజులుగా ఏర్పాట్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష, ఎమ్మెల్యే విజయ రమణారావు, ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్ పర్యవేక్షించారు.