రామగిరి, మార్చి 7: దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూపీఎస్సీ (UPSC) పరీక్షలో అఖిల భారత స్థాయిలో 55వ ర్యాంక్ సాధించిన గుడెల్లి సృజనను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభినందించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో నివాసం ఉంటున్న సృజన కుటుంబ సభ్యులతో పన్నూర్ గ్రామ సర్పంచ్ చిందం మహేష్ ద్వారా వీడియో కాల్లో మంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా సృజనను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి, ఆమె కృషి, పట్టుదల మరియు లక్ష్యసాధన యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. యూపీఎస్సీ వంటి అత్యంత కఠినమైన పరీక్షలో అఖిల భారత స్థాయిలో మంచి ర్యాంక్ సాధించడం గొప్ప విషయం అని తెలిపారు.
భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం సృజన తల్లిదండ్రులు రాజేశం, రాణిలతో ఫోన్లో మాట్లాడిన మంత్రి, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. మంథని ఇంజినీరింగ్ కళాశాలలో చదివిన తమ కుమార్తె ఈ స్థాయికి చేరుకోవడం కుటుంబానికి ఎంతో గర్వకారణమని సృజన తల్లిదండ్రులు తెలిపారు