పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండలంలోని రాగినేడులో ఉన్న శివాలయం మహా శివరాత్రి (Maha Shivaratri) వేడుకలకు ముస్తాబయింది. మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. రాగినేడుకు చెందిన పోతురాజుల భూమయ్య అనే రైతు వ్యవసాయ భూమిలో స్వయంభువుగా శివలింగం వెలసింది. వద్ద ఆలయం నిర్మించారు. దశాబ్దాల క్రితం వెలిసిన శివలింగానికి అప్పట్లో కొద్దిమంది రైతులు మాత్రమే పూజలు చేసేవారు. కాలక్రమంలో శివయ్య మహిమలపై విస్తృతంగా ప్రచారం సాగడం, అది కేసీఆర్ హయాంలో రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన కోలేటి దామోదర్ గుప్తా సొంతగ్రామం కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది. విషయం తెలుసుకున్న కోలేటి దామోదర్ గుప్తా అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దానిని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి దత్తత ఆలయంగా అప్పగించారు. ఈ క్రమంలో చెట్టుకింద పూజలందుకుంటున్న శివయ్యకు గుడి నిర్మించేందుకు మార్గం సుగమం అయ్యింది.
గ్రామస్తులు, భూ దాత భుమయ్య సహకారంతో కోలేటి దామోదర్ గుప్తా భారీగా డబ్బులు వెచ్చించి శ్రీ నాగలింగేశ్వర స్వామి పేరుతో చెట్టు కింది శివయ్యకు ఆలయం నిర్మించారు. పుష్పగిరి పీఠాధిపతి అయిన శంకరాచార్యుల ఆధ్వర్యంలో విగ్రహప్రతిష్టాపన చేయించారు. నాటి నుంచి ప్రతీ సంవత్సరం ప్రత్యేక పూజలు, కల్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ నెల 25, 26 తేదీలో శివ కల్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగవైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.