పెద్దపల్లి రూరల్ జూన్ 23 : ముదిమి వయసులో మనుములు, మనమరాళ్లతో సతోషంగా గడపాల్సిన ఆ వృద్ధురాలిని విధి వంచించింది. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు ఉన్నా కూడా బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్ల కోసం ఆ తల్లి పరుల సాయం కోసం ఎదురు చూస్తున్నది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అనాథగా మారిన ఆ వృద్ధురాలి జీవితం దినదినగండం నూరేళ్ల ఆయుష్షుగా మారింది. ఆ అభాగ్య జీవికి మానవతా హృదయంతో స్పందించి కొంతమంది అండగా నిలిచి గూడు కల్పించారు.
వివరాల్లోకి వెళ్తే..అందరు ఉన్నా ఓ అవ్వను అనాథలా తయారు చేసింది పేదరికం. పెద్దపల్లి జిల్లాలోని మండలం పెద్దకల్వల గ్రామానికి చెందిన శ్రీరాం పోచాలు-గట్టమ్మ దంపతులకు నలుగురు సంతానంలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు అయిపోయి వారికి పిల్లలు కాగా ఎవరి పందాన వారు బతుకుతున్నారు. కొడుకులు రాజేశం, లింగయ్యలు కల్లుగీస్తూ కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న క్రమంలో వారి తండ్రి శ్రీరాం పోచాలు అనారోగ్యంతో దాదాపు 10 ఏండ్ల క్రితం మృతి చెందడంతో అప్పటి నుంచి గట్టమ్మ(85)కు కష్టాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి పెద్దకొడుకుగా ఉన్న రాజేశం అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు. కొంత కాలానికి చిన్నకొడుకు లింగయ్య తాడిచెట్టుపై నుంచి పడడంతో మృతి చెందాడు. ఆర్థికంగా చితికి పోయిన కుటుంబాలకు మరింత ఆర్థిక భారం పెరిగింది. దీంతో గట్టమ్మను నా అని ఆదుకునే వారే కరవు కావడంతో కొంతమంది గ్రామస్తులు మానవత్వంతో స్పందించారు.
గట్టమ్మ కోసం బడిపక్కన గోడవెంట టార్పాలిన్ కవర్లు, పరదాలతో పందిరివేసి ఆశ్రయం కల్పించారు. అయితే వర్షాకాలంలో ముసురు వానలు, గాలి దమారాలు వస్తే ఆ చిన్న గూడు కూడా చెదిరిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంతో పాటు ఎవరైనా దాతలు ముందుకొచ్చి గట్టమ్మకు కూడు, గూడు కల్పించి మానవత్వంతో ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.