Grievance Cell | కోల్ సిటీ, మే 13: రామగుండం నగర పాలక సంస్థ పరిధి గోదావరిఖని రమేష్ నగర్ లో ఓ వ్యక్తి దర్జాగా కాలువను కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నాడు. ఇదే విషయమై ఆ కాలనీ ప్రజలు ఈనెల 10న ఆన్లైన్ ద్వారా గ్రీవెన్ సెల్ కు ఫిర్యాదు చేశారు. రమేష్ నగర్ లోని ఇంటి నం.15 2-331 యజమాని గడ్డం జయశంకర్ అనే వ్యక్తి కాలనీలోని కాలువను ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నాడని, కాలువ నీరు పారకుండా పిల్లర్ నిర్మిస్తున్నాడని స్థానికులు ఫొటోలు తీసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కాలువను ఆక్రమించి పిల్లర్ నిర్మాణం చేపడుతుండగా కాలనీ వాసులంతా వెళ్లి అడగగా మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దబాయించాడని, ఈ విషయంలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. పైగా రోడ్డుకు అడ్డుగా ర్యాంపు నిర్మాణం కూడా చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల రామగుండం నగర పాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నా, ఎక్కడైన ఆక్రమణలు జరిగినా నేరుగా కార్యాలయంకు రావల్సిన అవసరం లేదని, ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేస్తే తప్పకుండా పరిష్కరిస్తామని ప్రకటన విడుదల చేయగా, స్పందించిన కాలనీ వాసులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కానీ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యాలయంకు వెళ్లి అడిగితే టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అడగాలని తిప్పించుకుంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి చొరవ తీసుకొని తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.