పెద్దపల్లి, నవంబర్ 11(నమస్తే తెలంగాణ) :పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ వైస్ చైర్మన్‌గా పెద్దపల్లి పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కొండి సతీష్‌ను నియమించారు. రాష్ట్ర బీసీ జేఏసీ ఆదేశాల మేరకు జిల్లా చైర్మన్ దాసరి ఉష నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ వైస్ చైర్మన్ కొండి సతీష్ మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాంగ బద్దంగా 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకూ బీసీల పోరాటం ఆగదన్నారు. జిల్లాలోని వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలను కలుపుకొని పోతూ.. సమిష్టిగా పోరాడుతామన్నారు.
బీసీలు రాజ్యాధికారం చేపట్టే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ఉద్యమిస్తూ ముందుకు సాగుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలను సంఘటితం చేస్తూ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామ న్నారు. ఇందుకు గాను ప్రత్యేక కమిటీలు, సమావేశాలు, పర్యటనలను నిర్వహిస్తూ బీసీల కులవృత్తులను గౌరవిస్తూ.. వారి పటిష్టం కోసం పని చేస్తామన్నారు. బీసీలంతా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపడేవిధంగా బీసీ జేఏసీ పనిచేస్తుందన్నారు. తనపై నమ్మకంతో, జిల్లా వైస్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చిన రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్. కృష్ణయ్య, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్, బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉషలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.