ఓదెల, జనవరి 4 : పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం కొలనూరు గ్రామంలో అతి పురాతనమైన సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణకు జరుగుతున్న పనులను ఆదివారం సర్పంచ్, గ్రామస్తులు పరిశీలించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన జాతర కావడంతో నెలరోజుల ముందు నుంచే ఇక్కడ జాతర నిర్వహణకు పనులు ప్రారంభమయ్యారు. ఊరు చివరన చుట్టూ గుట్టల మధ్యన చెరువు సమీపంలో చెట్లు ఉండి ఆహ్లాదకర వాతావరణంలో ఈ జాతర జరుగుతుంది. దీంతో ఇక్కడికి మహారాష్ట్ర తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా తరలి రానున్నారు.
జాతర స్థలం వరకు రూపాయలు 95 లక్షలతో తారు రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే విజయ రమణారావు ఇటీవలనే ప్రారంభించారు. జాతర నిర్వహణకు జరుగుతున్న పనులను గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామస్తులు సందర్శించి పరిశీలించారు. ఇక్కడ సర్పంచ్ పల్లె కనకయ్య, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్, మాజీ సర్పంచులు ఢిల్లీ శంకర్, కుంచం మల్లయ్య, జాతర మాజీ చైర్మన్ దేవిది శ్యామ్ రెడ్డి, సామ చిన్నయ్య, బొంగాని రాజయ్య గౌడ్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.