ధర్మారం, జూన్ 27 : తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి గ్రామపంచాయతీ కార్మికులు (Grama Panchayathi Workers) పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లకుండా జీపీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులను స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గత 3 నెలలుగా వేతనాలు అందటం లేదని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, జీతాలు పెంచాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో హైదరాబాద్లో పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించకుండా ముందస్తుగా పలు గ్రామాలలోని గ్రామపంచాయతీ కార్మికులను ఆయా గ్రామాలలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని ధర్మారం పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ డిమాండ్లు సాధించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అక్రమంగా ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు ఆకుల రాజయ్య, సంఘం నాయకులు కూనమల్ల అశోక్,ఏదుల్ల రవికుమార్, ఉత్తెం రాజు తదితరులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ వర్కర్స్ పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతూ అన్యాయం చేస్తుందని విమర్శించారు. తాము ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యంతోపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా, మొక్కల సంరక్షణ కోసం పనిచేస్తున్నామని వారు పేర్కొన్నారు.
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్థానిక సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని, గ్రామపంచాయతీ సిబ్బందిని రెండో పీఆర్సీ పరిధిలో చేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు 8 గంటల పని దినాన్ని అమలు పరచాలని, పీఎస్, ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని, తమ కనీస వేతనాన్ని నెలకు రూ.26 వేలకు పెంచాలని, గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాలను గ్రీన్ ఫీల్డ్ ద్వారానే చెల్లించాలని, జీవో నెంబర్ 51ని సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు పరచాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించి పదోన్నతి కల్పించాలని, జీపీ సిబ్బంది పదవి విరమణకు రూ.5 లక్షలు చెల్లించాలని, ప్రమాదవశాత్తు సిబ్బంది మరణిస్తే రూ.10 లక్షల బీమా చెల్లించాలని, అనారోగ్యంతో మరణించిన సిబ్బంది కుటుంబంలో ఒకరికి తిరిగి గ్రామపంచాయతీలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.