కోల్ సిటీ, నవంబర్ 11: గోదావరిఖని నగరంలోని లారీ డ్రైవర్లకు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డా. నాగరాజు పాల్గొని సుమారు 150 మంది లారీ డ్రైవర్లకు ఈసీజీ, 2డీ ఈకో తదితర పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తాయన్నారు. లారీ డ్రైవర్లు తరచుగా దూర ప్రయాణాలు చేయడం ద్వారా మానసిక ఒత్తిళ్లకు గురవుతుంటారనీ, మీపై ఓ కుటుంబం ఆధారపడి ఉందన్న విషయం గమనించి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
మద్యం, ధూమపానంకు వీలైనంత దూరంగా ఉండాలన్నారు. చలికాలంలో వచ్చే వైరల్ ఫీవర్లను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. జ్వరాలకు సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. మెడికవర్ హాస్పిటల్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్,హరీష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.