కోల్ సిటీ, మార్చి 3 : రామగుండం నగరపాలక సంస్థ 33 వ డివిజన్ ఫైవ్ ఇంక్లైన్ ఏరియాలో సోమవారం రోడ్డు కోసం(Road construction) మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ నిరసన దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా బస్తీ వాసులు, మహిళలు తరలివచ్చి బైఠాయించారు. రామగుండం ఎమ్మెల్యే గాని, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, ఇన్చార్జి కమిషనర్ గాని వచ్చి రోడ్డు నిర్మాణం కోసం హామీ ఇచ్చేంతవరకు విరమించేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. మండుటెండలో సైతం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నడిరోడ్డు పైన కూర్చొని నిరసన ప్రదర్శన కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రామగుండంలో ఎంతో అభివృద్ధి చేశామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా డివిజన్‌కు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయమని అడిగితే కేసులు పెట్టిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. మా డివిజన్లో రోడ్డు వేయమని అడిగితే పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఆపద సమయంలో అంబులెన్స్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదని, ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి అని ప్రశ్నించారు.