పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 16: తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను అందించి ఆర్థిక ఎదుగుదలకు కారణమయ్యే ఆయిల్ పామ్ (Oil Palm) సాగుకు రైతులు ముందుకురావాలని పెద్దపల్లి ఉద్యానవనశాఖ అధికారి బోడుకల రాము అన్నారు. పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి, పాలితం గ్రామ శివారులలో దాసరివెంకట రమణారెడ్డి, దాసరి విష్ణుప్రీతం రెడ్డి సాగుచేస్తున్న ఆయిల్ పామ్ పంటలను, కొమ్మ గంగాధర్ సాగు చేస్తున్న నిమ్మ తోటలను సంబంధిత రైతులు, అధికారులతో కలిసి పరిశీలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. ఆయిల్ పామ్ పీచు వేరు వ్యవస్థ, వేర్లు వేర్లు పైపైనే ఉంటాయి. మొక్క నాటిన మొదటి సంవత్సరం నుంచి ఒక మీటరు రెండో ఏడాది రెండు మీటర్లు, మూడో సంవత్సరం మూడు మీటర్లు ఎడం వదిలి అంతర కృషితో పాటు అంతర పంటలు సాగు చేసుకోవాలి.
కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను ఐదు నుంచి ఆరు వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుందని, పూత సమయంలో భూమిలో వేయడం వలన సేంద్రియ పదార్థం పెరుగుతుంది. నాటిన తర్వాత 14 నుంచి 18 నెలల వరకు ఎలాంటి పొత్తులు (ఆడ, మగ పూల గుత్తులు) ఉండకుండా తొలగించాలి. ప్రతి రోజు ప్రతి మొక్కకి 200-400 లీటర్లపై బడి మొక్క వయస్సు బట్టి నీరందించాలి. రెండున్నర లేదా మూడు సంవత్సరాల వయస్సు గల తోటలలో పరపరాగ సంపర్కానికి ఇలాడోబియస్ కెమెరూనికస్ అనే వీవిల్స్ని వదలాలి. కాపు కొచ్చిన తోటల్లో ముదురు తోటల్లో గెలలు కోసిన వెంటనే ఆకులను ముక్కలుగా చేసి చెట్ల చుట్టూ వేయాలి. దీనివల్ల ఆకులు మంచిగా చివికి భూమిలో కలుస్తాయి. మట్టలను చాప్ కట్టర్ సాయంతో కత్తిరించి చెట్టు చుట్టూ వేయాలి. పక్వానికి వచ్చిన గెలలను మాత్రమే కోయాలి. తోటల్లో ఎప్పుడు తేమ ఉండే విధంగా చూసుకోవాలి. నీరును బిందు సేద్య పద్దతిలో మైక్రో జెట్స్ తో అందించాలి. ఎరువులను బిందు సేద్య పద్దతి ( ఫర్టిగేషన్) ద్వారా నీరందించాలి.
ఆయిల్ పామ్ సాగు చేసే ఆసక్తిగల రైతులు పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్, ఒక ఫొటోతో మీ మండల వ్యవసాయ కార్యాలయం లో లేదా, మీకు అందుబాటు లో ఉన్నా రైతువేదికకు వెళ్లి ఏఈవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీకు ఏదైనా ఉద్యానవన శాఖ సబ్సిడీ ల సమాచారం కోసం బి. రాము 8919896772 నంబర్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రైతులు కొమ్మ గంగాధర్, దాసరి వెంకట రమణా రెడ్డి, తిరుమల ఫీల్డ్ ఆఫీసర్ అరవింద్ రైతులు ఉన్నారు.