రామగిరి, ఆగస్టు 12: పెద్దపల్లి జిల్లా బేగంపేటలోని కేడీసీసీ బ్యాంక్ ఎదుట స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. ఏడాది క్రితమే ఏడాది క్రితమే ప్రభుత్వం ప్రకటించిన పంట రుణ మాఫీ (Runa Mafi) ఇప్పటికీ అమలు కాకపోవడంతో బ్యాంక్ ఎదుట బైఠాయించారు. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు వసూలు చర్యలు ప్రారంభించాయని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా 53 మంది రైతులకు సంబంధించిన రూ.1.54కోట్లు మాఫీ కావాల్సి ఉందన్నారు. సకాలంలో వర్షాలు కురువక బీడు పడిన పొలాలు, పంటల నష్టాలతో అప్పుల భారంలో ఉన్న సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం అన్యాయం అని విమర్శించారు.
తక్షణమే రుణమాఫీ అమలు చేసి, వసూలు చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. రైతుల ఆందోళన సమాచారం తో రామగిరి పోలీసులు చేరుకొని రైతుల రుణ మాఫీ విషయమై బ్యాంకు అధికారులను ఆరా తీశారు. తమకు రుణమాఫీ అయినా బ్యాంకు అధికారుల తప్పిదం వల్ల జాప్యం జరుగుతుందని ఆరోపించారు.