ధర్మారం,మార్చి19: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ లో గణనీయంగా నీటిమట్టం తగ్గిపోవడంతో తమ పంటలు ఎండిపోతాయని బుధవారం రిజర్వాయర్ కి అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి పంపు హౌస్ వద్ద రైతులు నిరసనకు దిగారు. రిజర్వాయర్ లో తగిన నీటిమట్టం నిలువ చేసిన తర్వాతే నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని తరలించాలని రైతుల డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైతుల ఆందోళనతో అప్రమత్తమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు ఇదివరకు ఒక మోటర్ ద్వారా నీటిని ఎత్తిపోస్తుండగా వేమునూర్ లో మరో మోటర్ ని ఆన్ చేశారు.వివరాలలోకి వెలితే.. నంది రిజర్వాయర్ కింద నంది మేడారం, గోపాల్ రావు పేట, శాయంపేట గ్రామాల్లో రైతులు సుమారు 650 ఎకరాలలో యాసంగి సీజన్లో వరి పొలాలు సాగు చేశారు. ఈ పొలాలకు ఈ రిజర్వాయర్ ప్రధాన ఆధారం. ఈ రిజర్వాయర్ ద్వారానే హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆయకట్టుకు నీటి సరఫరా అవుతుంది. ఈ రిజర్వాయర్ నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు గత మూడు నెలల నుంచి ఎల్లంపల్లి పైప్ లైన్ ద్వారా నీటిని తరలిస్తున్నారు.
గత నెల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న వేమునూరు ఎల్లంపల్లి పంప్ హౌస్ నుంచి ఒక మోటర్ ను ఆన్ చేసి 247 క్యూసెక్కుల చొప్పున నీటిని నంది రిజర్వాయర్ లోకి పంపింగ్ చేస్తూ అదే పరిమాణంలో నారాయణపూర్ రిజర్వాయర్ కు తరలిస్తున్నారు. అటువైపు నారాయణపూర్ రిజర్వాయర్ కు, ఇటు నంది రిజర్వాయర్ కింద ఉన్న వరి పొలాలకు నీటి సరఫరా నిరంతరంగా జరగడంతో రిజర్వాయర్ ల్ నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. ఈ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 233 మీటర్ల సామర్థ్యం కాగా ప్రస్తుతం 226 మీటర్ల నీటి మట్టానికి పడిపోయింది. దీంతో రిజర్వాయర్ లో ఉన్న నీటి గడ్డలు బయటకు తేలాయి. రిజర్వాయర్ లో నీటి నీటిమట్టం తగ్గడంతో ఆందోళన చెందిన నంది మేడారం గ్రామ రైతులు నంది రిజర్వాయర్ కు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి పంప్ హౌస్ వద్ద ఆందోళనకు దిగగా వారికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఎంపిటిసిల ఫోరం మండల మాజీ అధ్యక్షులు మిట్ట తిరుపతి, మాజీ ఎంపీటీసీ బొడ్డు రామన్న, సీనియర్ నాయకులు మిట్ట భరత్ కుమార్ సంఘీభావం తెలిపారు. రైతులు ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నంది రిజర్వాయర్లో సరిపడా నీటిని నిల్వ చేయాలని ఇక్కడ నీటిని నారాయణపూర్ రిజర్వాయర్ కు తరలించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నారాయణపూర్ రిజర్వాయర్ కు అక్కడి పొలాలకు నేటి సరఫరా జరుగుతుందని అధికారులు వివరిస్తూ మరొక మోటర్ ద్వారా రిజర్వాయర్లో నీటిని నింపుతామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం వేమునూరులోని ఎల్లంపల్లి పంప్ హౌస్ నుంచి మరో మోటర్ ఆన్ చేసినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు రెండు మోటర్ల ద్వారా నీరు నంది రిజర్వాయర్ లోకి పంపిణీ జరుగుతుందని వారు వివరించారు.