కోల్ సిటీ, ఏప్రిల్ 16 : ఆమె మరణించినా..కళ్లు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని చూస్తున్నాయి. పుట్టెడు దుఃఖంలో కూడా మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించడానికి మృతురాలి భర్త, కొడుకులు, కూతురు నేత్రదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖనికి చెందిన సంద చంద్రకళ(60) అనే గృహిణి అనారోగ్యంతో మృతి చెందగా ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించి ఆదర్శంగా నిలిచారు.
స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన సంద గోపతి అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి భార్య చంద్రకళ గుండెపోటుతో మృతి చెందింది. ఆమె నేత్రాలను దానం చేస్తే, ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చని ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సీనియర్ టెక్నీషియషన్ ప్రదీప్ నాయక్ అవగాహన కల్పించారు. దీంతో మృతురాలి భర్త గోపతి, కొడుకులు, కోడళ్లు సాగర్-జ్యోతి, కుమార్-సౌజన్య, కూతురు, అల్లుడు స్వప్న-మధు స్పందించి ముందుకు వచ్చారు. మృతురాలి నేత్రాలను టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సేకరించి హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఐ బ్యాంక్‌కు తరలించారు.
తల్లిని కోల్పోయిన విషాదంలో కూడా కుమారులు సమాజ హితం కోసం ఆలోచించి నేత్రదానం చేయడం పట్ల సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు టి.శ్రవణ్ కుమార్, లింగమూర్తి, భీష్మాచారి, సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, కే.ఎస్.వాసు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత అనంతరాములు, బోళ్ల చంద్రశేఖర్, లయన్స్ క్లబ్ బాధ్యులు పి.మల్లికార్జున్, తానిపర్తి విజయలక్ష్మి గోపాల్ రావు అభినందించారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు.