మంథని, ఫిబ్రవరి 11: కూరగాయలు విక్రయిస్తున్న ఓ వృద్ధురాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి (Elderly woman dies)చెందిన సంఘటన మంథనిలోని(Manthani) అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బంగారం గ్రామానికి చెందిన చీర్ల శంకరమ్మ (60) అనే వృద్ధురాలు తన భర్తతో కలిసి జీవిస్తోంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కాగా వారందరికీ వివాహం చేశారు. జీవనోపాధిలో భాగంగా తమ సొంత పొలంలో కూరగాయలను పండించి వాటిని మంథని కి తీసుకువచ్చి విక్రయిస్తోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం సైతం కూరగాయలను తీసుకోవచ్చు విక్రయానికి కూర్చుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నా శంకరమ్మ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెతో ఉన్న మరో వృద్ధురాలు ఇది గమనించి పక్కనే ఉన్న వారిని పిలవడంతో వారు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఆమెను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అప్పటివరకు పక్కనే ఉన్న వారితో మాట్లాడుతూ కూరగాయలను విక్రయిస్తూ ఉన్న వృద్ధురాలు ఒక్కసారిగా ఇలా కుప్పకూలి మృతి చెందిన తీరు అందర్నీ ఎంతగానో కలిచి వేసింది.