మంథని రూరల్:. మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీటి కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. గత కొద్ది రోజులుగా ప్రజలకు మంచినీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ అధికారులు గేట్ వాల్ హోల్ లో మట్టితో నింపడంతో ప్రజలకు మంచినీరు అందడం లేదు. ఈ విషయంపై శుక్రవారం అధికారులు గ్రామానికి వెళ్లగా ఒక్కసారిగా గ్రామస్తులు అంతా కలిసి అధికారుల పైకి ఎగబడ్డారు. ఎండాకాలంలో మంచినీరు లేక ఇబ్బంది పడుతుంటే గేట్ వాళ్లలో మట్టి పోయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజలకు మంచినీరు అందించాల్సిన అధికారులే ఇలా అడ్డదారుల్లో ప్రజలకు నీళ్లు రాకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
అధికారుల నిర్లక్ష్యంతో గత వారం రోజులుగా నీళ్లు లేక సతమతం అవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు పరిమితికి మించి మంచినీటిని వాడుతున్నారన్నారు. దీనివల్ల దిగువన ఉన్న గ్రామాలకు మంచినీరు సరఫరా కావడం లేదన్నారు. ప్రజలు సైతం మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అధికారులు కుటుంబానికి నలుగురు మాత్రమే ఉన్నారనే లెక్కలు మంచినీరు అందిస్తున్నారని, కానీ ఒక కుటుంబంలో ఆరుగురు నుంచి పది మందిరాక ఉంటారన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని ప్రజలు అన్నారు.