పెద్దపల్లి రూరల్ సెప్టెంబర్ 02 : పచ్చదనాన్ని పెంచి వర్షాలు సమృద్ధిగా పడేలా చేయడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రధాన రహదారుల వెంట మొక్కలను విరివిగా నాటడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని ప్రధాన రహదారులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం గ్రామాలతో పాటు మంథని ప్రాంతంలో కూడా పర్యటించారు.
ఇప్పటికే రహదారుల వెంట 40 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోగా 32 వేల మొక్కలను దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రదాన రహదారుల వెంట నాటిన ప్రతి మొక్కను బతికించడమే లక్ష్యంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీడీవొ కొప్పుల శ్రీనివాస్, ఏపీవో రమేష్ బాబు, టీఏ వెంకటేష్ , అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ రహమతుల్లా , జేఈ రాజయ్య, పంచాయతీ కార్యదర్శులు రవి, సదయ్య తదితరులున్నారు.