Quality education | కమాన్ చౌరస్తా, సెప్టెంబర్ 20 : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆర్థిక కారణాలతో నాణ్యమైన విద్యకు దూరం కావద్దని ట్రస్మ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు ఐఐటి, జీ, నీట్ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ఆయన అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు క్రమశిక్షణ, వినయం, విధేయత సహజ లక్షణంగా ఉంటాయని, విద్యార్థులు మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందుతారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానుగుణంగా నూతన విద్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని అప్పుడే కాలంతో పోటీ పడుతూ సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటారని తెలిపారు. పుట్టుకతో ఎవరూ పేదవారు కాదని వారి పరిశ్రమనే వారిని ఋషులుగా మార్చుతుందని లేదా చదువు మీద శ్రద్ధ చూపకపోతే దేనికి పనికిరాని వ్యక్తులుగా మిగులుతారని పేర్కొన్నారు. అందువల్ల కేవలం పేదరికం కారణంతో విద్యార్థులు ఎవరు నాణ్యమైన విద్యకు దూరం కాకూడదనే ఆలోచనతో తాను ఈ విలువైన స్టడీ మెటీరియల్ను అందించేందుకు ముందుకు వచ్చానని పేర్కొన్నారు.
విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో పోటీ పడాలంటే ఎప్పటికప్పుడు వాళ్ల మేధస్సుకు పదును పెట్టుకోవాలని, అందుకు అనుగుణంగా తరగతిగది పుస్తకాలతో పాటు ఇతర ఆధార గ్రంధాలను కూడా చదవాలని విస్తృతంగా తమకు లభించే స్టడీ మెటీరియల్ ను అధ్యయనం చేయాలని అప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. విద్యార్థులు ఏ విషయంగా కూడా నిరూత్సాహపడకూడదని ఫీల్డ్ ట్రిప్ కు వెళ్లే విద్యార్థులకు తాను ఉచితంగా బస్సులను అందిస్తానని అంతేకాకుండా పదవ తరగతిలో 10 జీపీఏ లేదా 570 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో ఉచిత ఇంటర్మీడియట్ విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు.
కరీంనగర్ అర్బన్ మండల విద్యాధికారి పుప్పాల కృష్ణ గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో విద్యా రంగంలో గొప్ప మార్పులు సాధించవచ్చునని ఈ భాగస్వామ్యం ఇలాగే కొనసాగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రైవేట్ భాగస్వామ్యం ముందుకు రావాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు యాదగిరి శేఖర్ రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సురేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. రాజేందర్ ఉపాధ్యాయులు గాజుల రవీందర్, తూముల తిరుపతి ,మంజూర్ అలీ,ప్రసాద్ రావు, గీత, అన్నపూర్ణ,రామారావు, శ్రీనివాస్,శంకరయ్య,అపోలీనా,పద్మజ,భారతి, విజయలక్ష్మి,షబానా, మమత,స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.