Road Accident | తిమ్మాపూర్, జూలై 15: రోడ్డు ప్రమాదంలో గాయపడి, నెల రోజులు నరకయాతన పడి చివరికి మృతిచెందాడు ఓ వ్యక్తి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అరవింద్ ఉన్నత చదువు (Higher Education) చదువుతున్నాడు. అలాగే కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఓ టీ స్టాల్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం పోరండ్ల గ్రామ శివారులో తన బైకు అదుపుతప్పి (Squid Bike) కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో కుటుంబ సభ్యులు మొదట కరీంనగర్ తర్వాత హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి బుధవారం మధ్యాహ్నం మరణించాడు. నెల రోజుల పాటు లక్షల ఖర్చు చేసినా కొడుకు దక్కక పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చికిత్స కోసం దాతల సహాయం కోసం ‘నమస్తే తెలంగాణ’లో వార్త ప్రచురించగా పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించారు. అరవింద్ మృతితో గొల్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.