పెద్దపల్లి, ఫిబ్రవరి14: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికలను(MLC elections) జిల్లాలో పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. ఈ నెల 27న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉపాధ్యాయుల కోసం 14 పోలింగ్ కేంద్రాలు, పట్టభద్రుల కోసం 36 పోలింగ్ కేంద్రాలను సిద్దం చేశామని, నిబంధనలు పాటిస్తూ పోలింగ్ సజావుగా నిర్వహించాలన్నారు.
నామినేషన్లు ఉపసంహరణ ముగిసిన తర్వాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు, పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ అధికారులకు అవసరమైన మొదటి దశ శిక్షణ అందించామని, శిక్షణకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, రెండవ దశ శిక్షణ కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా చూడాలని సూచించారు.
పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగనుందని వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద దివ్యాంగులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో సురేష్, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దోమ ఆదిరెడ్డి, జిల్లా అటవీ అధికారి శివయ్య, కలెక్టరేట్ సీ విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, రవాణా శాఖ అధికారి రంగారావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.