పెద్దపల్లి, డిసెంబర్9 : తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే నినాదంతో తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చేపట్టిన అమరణ దీక్షకు నాటి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణను ప్రకటించిన డిసెంబర్ 9 తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో డిసెంబర్ 9కి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ రోజును విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నామని తెలిపారు. విజయ్ దివస్ సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అమర వీరుల స్థూపానికి నివాళులర్పించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రభుత్వ దవాఖానలో రోగులు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, తన ప్రాణాన్ని పణంగా పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో డిసెంబర్ 9 చిరస్థాయిగా నిలిచిపోతుందని, తెలంగాణ బిడ్డలు డిసెంబర్ 9 విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహిం చుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంట రాములు యాదవ్, ఉప్పు రాజ్ కుమార్, మార్కు లక్ష్మణ్, నూనేటి సంపత్, తిరుపతి రెడ్డి, లైశెట్టి భిక్షపతి, పెంచాల శ్రీధర్, చంద్రశేఖర్, వైద శ్రీనివాస్, రాములు, మొబిన్, పహిం, శ్రీనివాస్, కాసిపాక వాసు, ఖదీర్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.