పెద్దపల్లి, ఫిబ్రవరి14: జిల్లాలో యాసంగి పంటకు అవసరమయ్యే యూరియా(Sufficient urea) అందుబాటులో ఉన్నాయని డీఏవో దోమ ఆదిరెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకు ఆర్ఎఫ్సీఎల్ నుంచి1508 మెట్రిక్ టన్నులు రాగా, రైల్వేస్టేషన్ నుంచి లారీల ద్వారా గోదాంలోకి తరిలించే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ.. యాసంగి సీజన్లో సాగువిస్తీర్ణం, రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37, 000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమగుతుందని ప్రణాళికలు తయారు చేశామని చెప్పారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 30, 201 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చిందని వెల్లడించారు. రైతులకు యూరియా సకాలంలో సరఫరా చేసేందుక అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
అతిగా వాడితే ఆగ్గి తెగులు సోకే ప్రమాదం
వరి పొలంలో మోతాదు మించి అతిగా యూరియా వాడితే అగ్గి తెగులు సోకే ప్రమాదం ఉందని, రైతులు గమనించాలని డీఏవో సూచించారు. ప్రతి మండలంలో సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా నిల్వలను అందుబాటులోఉంచడమే కాకుండా, సకాలంలో సరఫరా కొనసాగించేందుకు జిల్లా యంత్రాగం కూడా తరచుగా జిల్లాకు యూరియా కేటాయింపుల కోసం వ్యవసాయ శాఖ డైరెక్టర్ సంప్రదిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ యూరియా సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎటువంటి సమస్యలు ఉన్నా మండల వ్యవసాయఅధికారిని సంప్రదించవచ్చని సూచించారు.