కొత్త సంవత్సరం మొదలై అప్పుడే నెల గడిచిపోయింది. న్యూ ఇయర్ రిజల్యూషన్‌లో భాగంగా.. ‘రేపటి నుంచి జిమ్‌కి వెళ్లాలి’ అని ఇచ్చుకున్న తీర్మానం, ఎప్పుడో బుట్టదాఖలై పోతుంది. మొదట్లో హుషారుగా వెళ్లినా.. అక్కడ వెయిట్స్ ఎత్తేవాళ్లని, ట్రెడ్‌మిల్‌పై నాన్ స్టాప్‌గా పరిగెత్తేవాళ్లని చూసి.. తెలియకుండానే ఒక భయం మొదలవుతుంది. ‘అమ్మో! ఇవన్నీ నా వల్ల అవుతాయా?’ అనుకొని, ఆ ప్లాన్‌ను విరమించుకుంటారు చాలామంది. ఒకవేళ మీరు కూడా అదే లిస్టులో ఉంటే.. మీకోసమే ఈ గుడ్ న్యూస్! వర్కవుట్ అంటే కేవలం చెమటలు పట్టేలా కష్టపడటం కాదు. అసలు ఆయాసమే లేకుండా చేసే ‘జోన్ జీరో’తో కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అసలేమిటీ పద్ధతి? ఇది ఎవరికి సెట్ అవుతుంది?
సింపుల్‌గా చెప్పాలంటే.. గుండె వేగం పెరగకుండా, కండరాలపై ఒత్తిడి లేకుండా చేసే అతి తక్కువస్థాయి కదలికలను ‘జోన్ జీరో’ అంటారు. ఇందులో మీ హార్ట్‌రేట్ గరిష్ట వేగం.. 50 శాతం కంటే తక్కువగానే ఉంటుంది. అంటే మీరు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నమాట. సైన్స్ పరిభాషలో దీన్ని NEAT (Non-Exercise Activity Thermogenesis) అని వ్యవహరిస్తారు. అంటే జిమ్ సెషన్లు కాకుండా.. మనం రోజూ చేసే పనుల ద్వారా ఖర్చయ్యే శక్తి. నడవడం, నిలబడటం, ఇంటి పనులు చేయడం లాంటివన్నీ ఈ కోవకు చెందినవే! మరైతే, ఈ జోన్ జీరో కిందకు ఏమొస్తాయి? అంటే.. ‘నేను ఎక్సర్సైజ్ చేయలేను’ అని సాకులు చెప్పేవాళ్లకు కూడా ఇందులో ఆప్షన్లు ఉన్నాయి.
స్లో వాకింగ్: భోజనం చేశాక ప్రశాంతంగా కాసేపు అటు ఇటు నడవడం.
డెస్క్ మూమెంట్స్: ఆఫీస్ కుర్చీలో కూర్చున్నప్పుడే కాళ్లు, చేతులు కొంచెం స్ట్రెచ్ చేయడం.
ఇంటి పనులు: గదిని సర్దుకోవడం,
చిన్నపాటి క్లీనింగ్ పనులు చేయడం.
మెట్లు ఎక్కడం: లిఫ్ట్‌కి బదులు మెట్లు వాడటం.
ఇది కేవలం బద్ధకస్తుల కోసమే కాదు. అందరికీ ఉపయోగపడుతుంది. బిగినర్స్‌కి ఇదో ప్రోత్సాహం. వర్కవుట్ అంటే భయపడే వాళ్లకు ఇదొక మంచి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ‘నో పెయిన్’ కాన్సెప్ట్ కాబట్టి.. అలవాటు చేసుకోవడం సులభం. సీనియర్ సిటిజన్స్‌కి కూడా ఉపయుక్తం. కీళ్ల నొప్పులు ఉన్నవారికి, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారికి ఇది సేఫ్. రోజంతా కుర్చీకే అతుక్కుపోయే టెకీలకు మెటబాలిక్ హెల్త్ మెరుగుపడటానికి ఇది ఎంతగానో సాయపడుతుంది. కఠినమైన వర్కవుట్స్ తర్వాత బాడీని రికవర్ చేయడానికి ఇది ‘యాక్టివ్ రికవరీ’లాగా పనిచేస్తుంది.
కదలిక ఏదైనా సరే.. అది మన శరీరానికి మేలే చేస్తుంది. రోజంతా ఇలా యాక్టివ్‌గా ఉండటం వల్ల ఆకలి కంట్రోల్లో ఉంటుంది, మూడ్ బాగుంటుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంతేకాదు.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. గాయాలయ్యే ముప్పు అస్సలు ఉండదు! అయితే, జోన్ జీరో అనేది ప్రాపర్ ఎక్సర్‌సైజ్‌కి, హెల్తీ డైట్‌కి ప్రత్యామ్నాయం కాదు. ఇదో ఆరంభం మాత్రమే. గంటల తరబడి కదలకుండా కూర్చుని శరీరాన్ని తుప్పు పట్టించడం కంటే.. ‘జోన్ జీరో’లో చిన్నగా కదలడం ఎంతో మేలు. జిమ్‌కి వెళ్లలేదని బాధపడటం మానేసి, కనీసం ఆ సోఫా నుంచి లేచి ఐదు నిమిషాలు నడవండి. స్మార్ట్‌గా ఉండండి.. మీ బాడీని యాక్టివ్‌గా ఉంచుకోండి!