మన ఫోన్ మనకు పర్సనల్ డైరీ లాంటిది. అందులోనే ఫొటోలు, బ్యాంక్ వివరాలు, మెసేజ్‌లు అన్నీ దాచుకుంటాం. మన ఫోన్ మన ఆధీనంలోనే ఉందని అనుకుంటాం. కానీ, మనకు తెలియకుండానే డేటాను దొంగిలించే శత్రువులు మన ఫోన్లోనే తిష్టవేసి ఉండొచ్చు. సరదాగా వాడే కొన్ని యాప్‌లు మన లొకేషన్, బ్రౌజింగ్ హిస్టరీ, చివరికి మన ముఖ కవళికలను కూడా థర్డ్ పార్టీ సర్వర్లకు చేరవేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఓ మూడు రకాల యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే మీ డిజిటల్ గుర్తింపు ప్రమాదంలో పడ్డట్టే. వాటిలో ముందు వరుసలో ఉన్నవి మాత్రం ఉచిత VPN యాప్‌లు. చాలామంది తమ గుర్తింపును దాచుకోవడానికి లేదా బ్లాక్ చేసిన సైట్లను చూడటానికి ఉచిత VPN యాప్స్ వాడుతుంటారు.
ఇవి మీ డేటాను సురక్షితం చేస్తాయని ప్రచారం చేసుకుంటాయి కానీ, అసలు కథ వేరే ఉంటుంది. మీరు ఏ వెబ్సైట్లు చూస్తున్నారు? ఏ యాప్స్ వాడుతున్నారు? అనే ప్రతి విషయాన్ని ఇవి రికార్డ్ చేస్తాయి. ఈ డేటాను ప్రకటనల కంపెనీలకు అమ్ముకొని ఆదాయాన్ని పొందుతాయి. తర్వాతి స్థానంలో ఫ్లాష్‌లైట్-క్లీనర్ యాప్‌లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్లలో ఫ్లాష్‌లైట్, ఫోన్ క్లీనింగ్ ఫీచర్లు ఫోన్లోనే వస్తున్నా కూడా చాలామంది విడిగా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు. సాధారణ ఫ్లాష్‌లైట్ యాప్‌కి మీ కాంటాక్ట్స్, లొకేషన్, స్టోరేజ్ యాక్సెస్ వివరాలతో పనేంటని ఎప్పుడైనా ఆలోచించారా?! అవి మీ ఫోన్ క్లీన్ చేయడం కంటే, మీ అలవాట్లను ట్రాక్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెడతాయి.
ఇక మూడోరకం బ్యూటీ ఫిల్టర్-ఫొటో ఎడిటింగ్ యాప్‌లు. ఫొటోలు అందంగా రావడం కోసం ముఖానికి రకరకాల ఫిల్టర్లు పెట్టే యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకుంటారు. కానీ, ఇవి మీ ముఖానికి సంబంధించిన డేటాను తమ సర్వర్లకు అప్లోడ్ చేస్తాయన్న సంగతి గ్రహించం. ఈ యాప్స్ మీ ఫొటోలను ఎప్పుడు డిలీట్ చేస్తాయో, వాటిని దేనికి వాడుతాయో ఎవరికీ తెలియదు. ఇకనైనా యాప్ అడిగే పర్మిషన్లకు, అది చేసే పనికి సంబంధం లేకపోతే.. వాటిని మీ ఫోన్లోంచి తొలగించి జాగ్రత్త పడండి.