కొలంబో: మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌ను అతికష్టమ్మీద గెలిచిన పాకిస్థాన్.. రెండో మ్యాచ్‌లో మాత్రం రాణించింది. గత టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో తమకు ఓటమి రుచి చూపించిన యూఎస్ఏపై ప్రతీకారం తీర్చుకుంటూ ఆ జట్టుపై 32 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. పాకిస్థాన్ నిర్దేశించిన 191 పరుగుల ఛేదనలో యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లలో 158/8కే పరిమితమైంది. శుభమ్ రంజనె (30 బంతుల్లో 51, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) శయన్ జహంగీర్ (49) పోరాడారు. యూఎస్ఏ బ్యాటర్లను స్పిన్నర్లు నిలువరించి ఆ జట్టుకు టోర్నీలో రెండో విజయాన్ని అందించారు. అంతకుముందు మొదలు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ షాహిబ్జాదా ఫర్హాన్ (41 బంతుల్లో 73, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరవిహారానికి తోడు బాబర్ ఆజమ్ (32 బంతుల్లో 46, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 20 ఓవర్లకు 190/9 రన్స్ చేసింది.
రెండో ఓవర్లోనే మూడు బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఫర్హాన్ దూకుడుతో పాక్ పరుగుల వేట మొదలైంది. మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ (19), కెప్టెన్ సల్మాన్ అఘా (1) ఒకే ఓవర్లో నిష్క్రమించినా ఫర్హాన్ జోరు తగ్గలేదు. పవర్ ప్లేలో 56/2తో ఉన్న దశలో బాబర్ అండతో అతడు మరింత రెచ్చిపోయాడు. 27 బంతుల్లోనే అతడి అర్ధ శతకం పూర్తైంది. హర్మీత్ 13వ ఓవర్లో బాబర్.. 6, 4, 4తో పాటు ఫర్హాన్ కూడా బౌండరీ బాదడంతో 21 పరుగులొచ్చాయి. రెండు ఓవర్ల వ్యవధిలో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరినా షాదాబ్ ఖాన్ (12 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో పాక్ భారీ స్కోరు చేసింది.

భారీ ఛేదనలో యూఎస్ఏకు మంచి ఆరంభమే దక్కింది. 4.4 ఓవర్లలో 41/0తో ఉన్న ఆ జట్టు ఆ తర్వాత గాడి తప్పింది. స్పిన్నర్ల రంగప్రవేశంతో పరుగుల రాకే గగనమైంది. ఉస్మాన్ తారీఖ్ (3/27), షాదాబ్ (2/26), మహ్మద్ నవాజ్ (1/21), అబ్రర్ అహ్మద్ (1/30) నియంత్రణతో బౌలింగ్ చేయడంతో యూఏఈ ఛేదనలో వెనుకబడిపోయింది. జహంగీర్, శుభమ్ పోరాడినా వారిద్దరూ భారీ షాట్లు ఆడలేక చతికిలపడ్డారు. స్పిన్నర్ల కట్టడితో మధ్య ఓవర్లలో పరుగుల రాక మందిగించగా ఆఖర్లో ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచి విజయాన్ని ఖాయం చేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు : పాకిస్థాన్: 20 ఓవర్లకు 190/9 (ఫర్హాన్ 73, బాబర్ 46, షాడ్లీ 4/25, మోహ్సిన్ 1/27);
యూఎస్ఏ: 20 ఓవర్లకు 158/8 (శుభమ్ 51, జహంగీర్ 49, ఉస్మాన్ 3/27, షాదాబ్ 2/26 )