– రూ.13 కోట్ల పనులకు టెండర్
– అధికార పార్టీ కనుసన్నల్లో కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు
– విజిలెన్స్, సీడీఎంఏకు ఫిర్యాదు చేస్తామన్న మహిళా కార్పొరేటర్
కోల్ సిటీ, సెప్టెంబర్ 16 : రామగుండం నగర పాలక సంస్థలో చాలా యేళ్ల తర్వాత మళ్లీ కాంట్రాక్టర్లు రింగ్‌కు పాచికలు వేసినట్లు తెలిసింది. అధికార పార్టీ కనుసన్నల్లోనే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు రూ.13.70 కోట్ల పనులకు సంబంధించి ‘టెండర్’ లతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు రంగం సిద్ధమైనట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. దీనితో సుమారు రూ.1.50 కోట్లు చేతులు మారుతున్నాయని, తక్కువ పర్సంటీజీ లెస్ తో నిబంధనలకు విరుద్ధంగా అనర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారని 25వ డివిజన్ మాజీ మహిళా కార్పొరేటర్ నగునూరి సుమలత ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీడీఎంఏ, విజిలెన్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు మీడియాకు ఆమె వెల్లడించారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆర్సీసీ పైపులు ఉండగా, వాటిని మార్చి మట్టి పైపులు పెట్టి కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధంగా టెండర్లను అప్పగించడంలో అధికారుల పాత్ర దాగి ఉన్నట్లు ఆరోపించారు.
కాగా, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి ఈ రూ.13 కోట్ల నిధుల నుంచి బిల్లులు చెల్లింపులు చేయాలంటూ సీడీఎంఏ నుంచి ఆదేశాలు వచ్చినా, అది జరగకుండా ప్రస్తుత అధికార పార్టీ మాత్రం తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే కొత్తగా పనులు అప్పగించినట్లు ఆమె ఆరోపించారు. నగర పాలక సంస్థలో ట్రాన్స్ ఫర్ డ్యూటీ ఫండ్స్ కు సంబంధించి ఏడు ప్యాకేజీల ద్వారా టెండర్లు విడుదల చేశారు. ఐతే ఇక్కడే కాంట్రాక్టర్లు తక్కువ లెస్ తో పనులు దక్కించుకోవడానికి రింగ్ గా ఏర్పడినట్లు తెలుస్తోంది. భూగర్భ డ్రైనేజీ పనుల టెండర్లలో పెద్ద మొత్తంలోనే గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు. ఈ విషయమై కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను అడగగా, తమ చేతిలో ఏమి లేదని నిర్లక్ష్య సమాధానంతో చేతులెత్తేసారని తెలిపారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో టెండర్ల విషయంలో ప్రభుత్వంకు అధిక ఆదాయం చేకూరే విధంగా టెండర్ల నిర్వహణ ఉండేదనీ, ఈసారి వన్ పర్సెంట్ తో నే కాంట్రాక్టర్లు కుమ్మక్కై టెండర్లు దక్కించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
వీరందరికి అధికార పార్టీ నాయకుల అండదండలతో వ్యవహారం నడుస్తుందని ఆరోపించారు. ఎవరు ఎదిరించి మాట్లాడినా ఇక్కడ బెదిరింపులు జరుగుతున్నాయనీ, అదే ధీమాతో కాంట్రాక్టర్లు అధికారులు కలిసిపోయి దాదాపు కోటిన్నర జేబుల్లో వేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. నగర పాలక సంస్థలో అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ కూడా అవకతవకలకు, అవినీతికి చోటు ఇవ్వమని ఒకవైపు అధికార పార్టీ నాయకులు చెబుతూనే మరోవైపు తెరవెనుక ఉండి తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే తక్కువ లెస్ తో పనులు అప్పగించేలా పాచికలు వేశారని, ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తో పాటు విజిలెన్స్ ఉన్నతాధికారులు, సిడిఎంఏ దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.