పెద్దపల్లి : రాష్ట్రమంతా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 36 గంటలు సమీపిస్తున్నా పెద్దపల్లి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress leaders) ఎన్నికల కోడ్ను పట్టించుకోవడం లేదు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గురువారం ఎలిగేడు, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయగా జిల్లావ్యాప్తంగా ఇంకా కాంగ్రెస్ ఫ్లెక్సీలు దర్శనమిస్తూనే ఉన్నాయి. కోడ్ అమల్లోకి వచ్చి 36 గంటలు సమీపిస్తున్నా ఇంకా అధికారులు జిల్లాలో మొద్దు నిద్రపోతున్నారు.
దాంతో కోడ్ అమల్లో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించకుండా వేడుక చూస్తున్నారు. దీంతో ఎన్నికల కోడ్ పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు వర్తించదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో పనిచేస్తున్న అధికారులు కనీసం ఎన్నికల కోడ్ ను సైతం విస్మరిస్తున్నా ఉన్నతాధికారులకు పట్టదా? అని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.