పెద్దపల్లి, జనవరి6 : పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పిల్లలు భిక్షాటన చేస్తూ కనిపించడానికి వీలు లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్, దేవాలయాలు, బస్టాండ్, జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో రెగ్యులర్ తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. . సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఐసీపీఎస్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చదువుకునేలా చర్యలు చేపట్టి, పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో పేరేంట్, టీచర్స్ మీటింగ్కు సంక్షేమ శాఖ తరపున ఎవరైనా హాజరయ్యేలా చూడాలన్నారు. అనాథ పిల్లల తల్లి తండ్రుల పేరు మీద ఏవైనా ఆస్తులు ఉంటే అన్యాక్రాంతం కాకుండా పిల్లలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లా సంక్షేమ శాఖ నుంచి వచ్చే అనాథ, పాక్షిక అనాథ బాలికల జాబితాను ఆమోదించి కేజిబీవీల లో, గురుకులాలో సీట్లు కేటాయించాలని ఆదేశించారు. చైల్డ్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ 1098కు వచ్చే ప్రతి ఫిర్యాదు అటెండ్ కావాలని ఆదేశించారు. జిల్లాలో అనాథ ఆశ్రమాలు, వృద్దాశ్రమాలను అనుమతి లేకుండా నడపడానికి ఆస్కారం లేదన్నారు. జిల్లాలో ఎక్కడ బాల్యవివాహాలు జరగడానికి వీలు లేదన్నారు.
జిల్లాలో జరిగే ప్రతి అబార్షన్ కేసు ట్రాక్ చేయాలని, ఆడపిల్ల పుడుతుందనే కారణంతో జరిగే అబార్షన్లను నిలువరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో ఐసీపీఎస్ ఐ.సి.పి.ఎస్ కార్యకలాపాల పై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.