coal cilty contractors | కోల్ సిటీ, మే 27: రామగుండం నగర పాలక సంస్థలో పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్లదే హవా నడుస్తుంది. కార్పొరేషన్లో పిలిచిన ప్రతీ టెండర్ ను దక్కించుకునేందుకు బడా కాంట్రాక్టర్లు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే పేరును వాడుకొని పనులకు స్కెచ్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆన్లైన్ టెండర్లలో ఎవరు పాల్గొనకుండా మర్యాదగా హెచ్చరిస్తున్నారు.
తాజాగా రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో బక్రీద్ పండుగ సందర్భంగా వేడుకలకు సంబంధించి ఏర్పాట్ల కోసం నగర పాలక సంస్థ ఆన్లైన్ టెండర్లు పిలిచింది. కార్పొరేషన్ సాధారణ నిధుల కింద రామగుండం రైల్వే స్టేషన్ ఈద్గా, ఎస్.టీ కాలనీ ఈద్గా, రామగుండంలోని ఈద్గా, మసీదుల వద్ద జబల్లలో పైపు పండల్ టెంట్, గ్రీన్ మ్యాట్, రెడ్ మ్యాట్, వాటర్ క్యాన్లు, సైడ్ వాల్స్, సౌండ్ సిస్టమ్, మైక్ తదితర ఏర్పాట్ల కోసం ఈ నెల 23న రూ.4.96 లక్షల అంచనా వ్యయంతో ఆన్లైన్ టెండర్ పిలిచింది.
అలాగే శాంతినగర్ ఈద్గా, ప్రభుత్వ దవాఖాన సమీపంలోని ఈద్గాలో పైప్ పండల్ టెంట్, గ్రీన్, రెడ్ మ్యాట్, వాటర్ క్యాన్లు, సైడ్ వాల్స్ కోసం రూ.4.97 లక్షల అంచనా వ్యయంతో టెండర్‌ను పిలిచారు. అలాగే గోదావరిఖని ఫైవిం క్లయిన్ ఈద్గా వద్ద పైప్ పండల్ టెంట్, గ్రీన్ మ్యాట్ తదితర ఏర్పాట్లకు మరో రూ.4.19లక్షల అంచనా వ్యయంతో టెండర్ పిలిచారు. ఈ పనులకు గానూ ఆన్లైన్ లో టెండర్ దాఖలుకు 30వ తేదీ వరకు గడువు ఉంది.
చోటామోటా కాంట్రాక్టర్లకు పెద్ద చిక్కే..
ఈ పనుల కోసం టెండర్లు వేద్దామనుకున్న చోటామోటా కాంట్రాక్టర్లకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఐతే గత సంఘటనలు పునరావృతం గాకుండా ఈ సారి ఆ పనులను మైనార్టీ వారికి అప్పగించేందుకు స్థానిక ఎమ్మెల్యే నిశ్చయించాడనీ, కావునా ఆన్లైన్ టెండర్లో ఎవరూ పాల్గొనకుండా ఆ పనులను వదులుకోవాలంటూ మంగళవారం ఓ కాంట్రాక్టర్ తోటి కాంట్రాక్టర్లకు సందేశాలు పంపించడం మరో చర్చనీయాంశమైంది. ఆన్లైన్ టెండర్లను ఆఫ్‌లైన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతుంది. దీంతో చోటామోటా కాంట్రాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. చిలికి చిలికి గాలివానగా మారకముందే స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని న్యాయం చేయాలని చోటా కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
Rains | హైదరాబాద్‌కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు