కోల్ సిటీ, జనవరి 6 : త్వరలో జరగబోయే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలీల బలం చాటాల్సిన అవసరం ఉందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్ప రాజేశం, ఆడెపు శంకర్ పిలుపునిచ్చారు. ఈమేరకు గోదావరిఖని నగరం కళ్యాణ్ నగర్ గల ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘం ముఖ్య ప్రతినిధుల ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ లో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీల రాజకీయ సాధికారతకు ఈ ఎన్నికలను వేదికగా చేసుకుందామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు అనుకూలిస్తే వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా పద్మశాలీల అభ్యర్థులను గెలిపించుకోవాలని సంఘం రాష్ట్ర నాయకత్వం ఆదేశించినట్లు తెలిపారు.
కార్పొరేషన్ పరిధిలో దాదాపు 32వేల చిలుకు పద్మశాలీల ఓటు బ్యాంకు ఉందనీ, మొత్తం 28 డివిజన్లలో పద్మశాలీ ప్రతినిధులు పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నారనీ, పార్టీ ఏదైనా పద్మశాలీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సంఘటితంగా పని చేయాలని పిలుపునిచ్చారు. సంఘం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పద్మశాలీలు ఏకతాటిపైకి రావాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల సంఘం అధ్యక్షులు పిట్ట లక్ష్మీనర్సయ్య, మండల సత్యనారాయణ, గుండేటి రాజేశ్, కొండి సంపత్, మోర శ్రీనివాస్, మామిడాల రాజేశ్వరరావు, ఎలగందుల శ్రీకాంత్, అనుమ భద్రయ్య, దేవుపల్లి చక్రపాణి, తాటికొండ రాజబాబు, ఆడెపు రాజేశం, బొద్దున శంకరయ్య పాల్గొన్నారు.