రామగిరి మార్చి 31: ఎస్సారెస్పీ కెనాల్లో రెండేళ్ల చిన్నారి గల్లంతైన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిషా రాష్ట్రం అంగుల్ జిల్లాకు చెందిన దాస్ సాగర్ తన కుటుంబంతో ఏడు నెలల క్రితం కల్వచర్లకు వచ్చి ఎస్బీకే బ్రిక్ ఇండస్ట్రీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దాస్ సాగర్ కి ముగ్గురు పిల్లలు. మధ్యాహ్నం సమయంలో తల్లిదండ్రులు ఇటుకల బట్టీ వద్ద పనిచేస్తుండగా ఎస్సారెస్పీ కెనాల్ రోడ్డుపైన ఆడుకుంటూ దాస్ సాగర్ చిన్న కుమార్తె దాస్ గెల్లి (2) అనే చిన్నారి ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయింది.
విషయం తెలుసు కున్న కుటుంబ సభ్యులు చిన్నారి గురించి కెనాల్ లో గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రామగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఘటన వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సారెస్పీ కెనాల్లో నీరు ప్రవహిస్తుండడంతో చిన్నారి ఆచూకీ కష్టంగా మారింది. ఎస్ఐ చంద్రకుమార్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటి విడుదలను నిలిపివేసిన ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ఈ ఘటన పై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.