ఓదెల, మే 8 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ధాన్యం, మొక్కల కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. మొక్కల కొనుగోలు కేంద్రంలో ఎకరాకు 25 క్వింటాలనే కొనుగోలు చేస్తామన్న నిబంధనను ఎత్తివేయాలని కోరారు.
అలాగే బార్ధాన్ సంచికి ఐదు రూపాయలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
కౌలు రైతుల బాధలు అంతా ఇంత కాదని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలి తప్ప యాప్ పేరుతో రైతులను వేధించడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలు 1010 రకాన్ని కామన్ రకంగా పంపించడం వల్ల రైతులు నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. అలాగే సంచికి 41, 2 00 కిలోలు జోకడం ఏంటి అని నిలదీశారు. కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించాల్సి ఉండేదని, 20 తారీఖు తర్వాత ప్రారంభించడం వల్ల అకాల వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతున్నట్లు తెలిపారు.
ఓదెలలో మొక్కజొన్న వేసిన రైతు చనిపోతే ఆ రైతు వేలిముద్ర పెడితేనే కొనుగోలు చేస్తామని నిబంధన ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి దగ్గర అని చెప్పుకుంటున్న పెద్దపెల్లి ఎమ్మెల్యే ఈ బాధలను సీఎంకు తెలిపి వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనియెడల రైతులతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్యవేని రవి, బీఆర్ఎస్ నాయకులు బోడగుంట నరేష్, పోలోజు రమేష్, తీర్థాల కుమార్, రాచర్ల కుమార్, సూత్రాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.