రామగిరి, జనవరి 04 : ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మేడిపల్లి శివారులో రసాయన కర్మాగారాలు ఏర్పాటు చేస్తే ఉద్యమిస్తామని బీజేపీ మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ హెచ్చరించారు. ప్రభుత్వం సుమారు 220 ఎకరాల భూమిని సేకరించి, రైతులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని ఆయన మండిపడ్డారు. భూసేకరణకు సంబంధించి నిన్నటితో సంతకాల సేకరణ పూర్తయినప్పటికీ, అధికారులు మొదట యాసంగి పంటకు అనుమతి ఇచ్చి, రైతులు పంట సాగు చేసిన అనంతరం ఈ భూముల్లో ఎలాంటి పంటలు వేయరాదని, వేస్తే నష్టపరిహారం చెల్లించబోమని నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయమని విమర్శించారు.
ఇది రైతులను మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చకపోతే, అలాగే ఈ భూముల్లో రసాయన కర్మాగారాలను తీసుకొస్తే, ప్రజలతో కలిసి తీవ్ర ఉద్యమానికి సిద్ధమవుతామని కొండు లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే సింగరేణి కాలుష్య ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరోసారి ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రసాయన పరిశ్రమలు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమన్నారు. వెంటనే రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి, స్పష్టత ఇవ్వాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.