పెద్దపల్లి సెప్టెంబర్ 11: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, చెరువులు, వాగుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కూలిపోయే ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వరద నీరు వచ్చే లోతట్టు ప్రాంతాలు ఉన్న గ్రామాలను గుర్తించి అవసరమైన మేర సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 7995070702 ను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.