హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిల వసూళ్లకు పౌరసరఫరాల శాఖ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ అసలు లక్ష్యం.. మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడమా? లేదా కేసులు పెట్టడమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల మిల్లర్లు బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా, కేసులు నమోదు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఉత్తర తెలంగాణ జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఓ రైస్ మిల్లుపై దాడి చేశారు. అక్కడ ధాన్యం తేడా ఉన్నట్టు గుర్తించారు. సదరు మిల్లు యజమాని ఈ మొత్తానికి డబ్బులు చెల్లించేందుకు అంగీకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే విజిలెన్స్ అధికారులు మాత్రం బకాయిలు వసూలు చేయకుండా సదరు మిల్లు యజమానిపై కేసు నమోదుకు నిర్ణయించినట్టు సమాచారం. ఇలా సివిల్ సప్లయ్, విజిలెన్స్ అధికారులు మిల్లుపై దాడి చేస్తే సదరు యజమానులపై కచ్చితంగా కేసు నమోదు కావాల్సిందే, వాళ్లు జైలుకు వెళ్లాల్సిందే అన్నట్టుగా పరిస్థితి తయారైందని అంటున్నారు. ఇలా దాడులు చేస్తూ కేసులు పెట్టుకుంటూ పోతే బకాయిల వసూలు ఎలా అని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పైసలు రావడం సంగతి పక్కనపెడితే.. కేసుల సంఖ్య పెరిగి, వాటి కోసం కోర్టుల చుట్టూ తిరగడమే పనిగా ఉంటుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో బకాయిల చెల్లింపులో మిల్లర్లు మొండికేస్తున్నట్టు సమాచారం. ‘కేసు నమోదు చేశారు కదా.. బకాయిలపై కోర్టులోనే తేల్చుకుందాం. కేసు పూర్తయ్యే వరకూ బకాయిలు చెల్లించే ప్రసక్తే లేదు’ అని మిల్లర్లు తేల్చి చెప్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల ఓ మిల్లుపై దాడి చేయగా ధాన్యం షార్ట్‌ఫాల్ ఉన్నట్టుగా తేలిందట. ముందుగా రూ.2 కోట్లు చెల్లించాలని, ఆ తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. అయితే సదరు మిల్లు యజమాని స్పందిస్తూ ‘ఇప్పుడు రూ.2 కోట్లు చెల్లించినా, చెల్లించకపోయినా కేసు పెడతారు. అలాంటప్పుడు డబ్బులు చెల్లించి కేసులు ఎందుకు పెట్టించుకుంటా?’ అని ప్రశ్నించినట్టు సమాచారం. కేసు నమోదు చేస్తారు కాబట్టి కోర్టులోనే తేల్చుకుందాం.. అని స్పష్టం చేసినట్టు చెప్తున్నారు. ఇలా మిల్లర్లు మొండికేస్తుండటంతో బకాయిల వసూలు సవాల్‌గా మారే ప్రమాదం ఉన్నదంటున్నారు. మిల్లర్లపై దాడులు చేసి కేసులు పెట్టి వసూలు చేసే బకాయిలు కొంతేనని, ఆ తర్వాత పెండింగ్ ఉండేవి భారీగా ఉంటాయని పేర్కొంటున్నారు. ఆ మొత్తం తిరిగి వసూలు చేయడం చాలా కష్టమని, ఫలితంగా సివిల్ సప్లయ్‌కి భవిష్యత్‌లో ఆర్థిక తిప్పలు తప్పవని స్పష్టంచేస్తున్నారు.
2022-23 టెండర్ ధాన్యానికి సంబంధించిన బకాయిల వసూళ్లలో అధికారులు చెప్పే మాటలకు వసూళ్లకు పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లులపై యుద్ధం ప్రకటించినట్టుగా దాడులు చేసిన అధికారులు ఇప్పటి వరకు వసూలు చేసింది రూ.వెయ్యి కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 2022-23కు సంబంధించిన 15.94 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నది. దీని విలువ రూ.3,572 కోట్లు. వీటి వసూలుకు అధికారులు దాదాపు రెండు నెలలపాటు దాడులు చేసి మూడింట ఒకవంతు మాత్రమే వసూలు చేయగలిగారు. ఇంకా సుమారు రూ.2,500 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నది. వీటిపై మిల్లర్లకు అక్టోబర్ నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. టెండర్ ధాన్యానికి సంబంధించి క్వింటాల్‌కు రూ.2,236, రూ.2,437 చొప్పున వసూలు చేయడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రాతిపదికన ఈ ధర నిర్ణయించారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని మిల్లుల్లో టెండర్ ధాన్యం ఉన్నా, వాటిని తీసుకోకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సివిల్ సప్లయ్‌లో కొత్త పంచాయితీ మొదలైంది. మిల్లులపై దాడులకు సంబంధించి విజిలెన్స్ వర్సెస్ విజిలెన్స్‌గా మారినట్టు సమాచారం. మిల్లులపై దాడులకు ఇటు సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం, అటు పోలీస్ శాఖలోని విజిలెన్స్ విభాగం పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నది. ఎవరికివారు బృందాలుగా ఏర్పడి పోటాపోటీగా దాడులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేసుల నమోదులోనూ పోటీ పడుతున్నట్టు సమాచారం. ఎవరు ఎక్కువగా బకాయిలు వసూలు చేశారనేది కాకుండా, ఎవరు ఎక్కువగా కేసులు నమోదు చేశారనే లెక్కలో పోటీ పడుతున్నట్టు చర్చ జరుగుతున్నది. అందుకే ఇటీవల ఓ మిల్లు యజమాని బకాయిలు చెల్లిస్తానని చెప్పినా పట్టించుకోకుండా, కేసు నమోదు చేసినట్టు సమాచారం. చర్చ సందర్భంగా.. ‘వాళ్లు ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నారు. మళ్లీ మా లెక్క తక్కువవుతుంది’ అంటూ విజిలెన్స్ అధికారులు చెప్పినట్టు తెలిసింది.