Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పెద్ద కుమారుడు హ్రేహాన్ రోషన్ ఇప్పుడు తన సొంత గుర్తింపును సంపాదించుకునే దిశగా తొలి అడుగు వేశాడు. స్టార్ కిడ్‌గా సినీ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలామంది భావించినప్పటికీ.. హ్రేహాన్ మాత్రం సంగీత ప్రపంచాన్ని తన కెరీర్‌గా ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సంగీత కళాకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తూ విడుదల చేసిన తొలి పాటకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. హ్రేహాన్ రోషన్ తన తొలి సింగిల్ ‘దిస్ హెవెన్లీ ప్లేస్’ తో అధికారికంగా సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం విడుదలైన ఈ పాటతో హ్రేహాన్ తనలోని విభిన్నమైన టాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
కేవలం గాయకుడిగానే కాకుండా.. ఈ పాట కోసం హ్రేహాన్ సింగర్, సాంగ్‌రైటర్, గిటారిస్ట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించడం విశేషం. స్వయంగా పాట పాడటంతో పాటు.. దాని రచనలో భాగస్వామి కావడం, గిటార్ వాయించడం ద్వారా సంగీతంపై తనకున్న ఆసక్తి, పట్టుదలను చాటుకున్నాడు. ‘దిస్ హెవెన్లీ ప్లేస్’ మ్యూజిక్ వీడియోను చాలా సింపుల్‌గా రూపొందించారు. ఎలాంటి భారీ సెట్లు, హంగులు, ఆర్భాటాలకు వెళ్లకుండా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్‌లో వీడియోను తెరకెక్కించారు. వీడియోలో హ్రేహాన్ గిటార్ వాయిస్తూ పాట పాడుతూ కనిపిస్తాడు. ఈ మినిమల్ సెటప్ వల్ల ప్రేక్షకుల దృష్టి పూర్తిగా అతడి సంగీతం, గాత్రం, ప్రదర్శనపైనే నిలిచేలా మ్యూజిక్ వీడియోను రూపొందించారు. తొలి ప్రయత్నంలోనే తన వ్యక్తిగత సంగీత శైలిని పరిచయం చేసే ప్రయత్నం చేశాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
హ్రేహాన్ తొలి పాట విడుదల కావడంతో రోషన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు హ్రేహాన్ కొత్త ప్రయాణంపై ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అతడికి అభినందనలు తెలియజేస్తున్నారు.ముఖ్యంగా తండ్రి హృతిక్ రోషన్ కుమారుడి సంగీత అరంగేట్రాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరో కుమారుడిగా వచ్చిన గుర్తింపును మాత్రమే నమ్ముకోకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన రంగాన్ని ఎంచుకుని ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేయడం హ్రేహాన్కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది. పాట విడుదలైన వెంటనే అభిమానులు, సంగీత ప్రియుల నుంచి సానుకూల స్పందన రావడం హ్రేహాన్కు మంచి ఆరంభంగా మారింది. అతడి వాయిస్, గిటార్ ప్లేయింగ్, సింపుల్ ప్రెజెంటేషన్‌ను పలువురు అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో అతడు మరిన్ని సింగిల్స్‌తో పాటు విభిన్నమైన సంగీత ప్రాజెక్ట్‌లను తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు.