Toxic | రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ.. విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్లలో సినిమా ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోవడంతో పలు థియేటర్లలో ‘టాక్సిక్’ షోలను తొలగించి, హాలీవుడ్ భారీ చిత్రం ‘ది ఒడిస్సీ’ కు అవకాశం కల్పిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో రూపొందిన ‘టాక్సిక్’పై విడుదలకు ముందు భారీ హైప్ ఏర్పడింది. అయితే సినిమా విడుదలైన తర్వాత విమర్శకుల నుంచి తీవ్ర స్థాయిలో నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ముఖ్యంగా సినిమా మేకింగ్, పాత్రల రూపకల్పన, కథనంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. విజువల్స్ పరంగా సినిమా ఆకట్టుకున్నప్పటికీ.. కథను తెరపై ఆసక్తికరంగా చూపించడంలో చిత్రబృందం విఫలమైందనే అభిప్రాయాలు వినిపించాయి. పాత్రలను మరింత బలంగా తీర్చిదిద్దాల్సిందని, కథనం నెమ్మదిగా సాగడం వల్ల సినిమా బోరింగ్‌గా అనిపించిందని పలువురు విమర్శకులు పేర్కొన్నట్లు సమాచారం.ఈ నెగెటివ్ టాక్ ప్రభావం ఇప్పుడు థియేటర్ల ఆక్యుపెన్సీపై కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
‘టాక్సిక్’ విడుదలైన తొలి రోజుల్లో భారీ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లినప్పటికీ.. రోజులు గడుస్తున్న కొద్దీ ఆక్యుపెన్సీలు తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫార్మాట్ అయిన ఐమ్యాక్స్ స్క్రీన్లలో ఆక్యుపెన్సీ భారీగా పడిపోవడం చిత్రానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఐమ్యాక్స్ థియేటర్లు ‘టాక్సిక్’ షోలను తగ్గించి.. ప్రపంచవ్యాప్తంగా భారీ బాక్సాఫీస్ వసూళ్లతో దూసుకుపోతున్న క్రిస్టోఫర్ నోలన్ చిత్రం ‘ది ఒడిస్సీ’ కు స్క్రీన్లను కేటాయిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే పలు ఐమ్యాక్స్ స్క్రీన్లలో ‘ది ఒడిస్సీ’ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయని, మరికొన్ని స్క్రీన్లు కూడా త్వరలో అదే బాట పట్టనున్నాయని టాక్ వినిపిస్తోంది. ‘టాక్సిక్’ షోలను తగ్గించి ‘ది ఒడిస్సీ’కి ఐమ్యాక్స్ స్క్రీన్లు కేటాయించడంతో నోలన్ సినిమా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు బుకింగ్స్ చేయడం పెరగడంతో ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక బుక్‌మైషోలో ‘ది ఒడిస్సీ’ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది