ధర్మారం,మార్చి 25: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పోలీసులచే అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆశ వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమకు 18 వేల ఫిక్స్డ్ వేతనాన్ని ఇస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని విస్మరించడంతో ఈనెల 24న హైదరాబాద్ లోని మెడికల్ అండ్ హెల్త్ కమిషనరేట్ ఎదుట ధర్నాకు సిఐటియు పిలుపునిచ్చిందని ఆశ వర్కర్లు తెలిపారు.
ఆ ధర్నాకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగించి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే ఆశ వర్కర్లను పోలీస్ స్టేషన్లకు తరలించి అక్రమంగా నిర్బంధించింది. తమ హక్కులను కాలరాసే విధంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని కరీంనగర్ – రాయపట్నం రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకోతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.