కోల్ సిటీ, మార్చి 19 : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి సంస్థ నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం కావడానికి సెంట్రల్ లైబ్రరీని(Central library) నిర్మించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పవర్ హౌస్ కాలనీలో ఉన్న జిల్లా గ్రంథాలయాన్ని ఏఐవైఎఫ్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా మార్కపురి సూర్య మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వేలాదిమంది నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి సరిపడే వసతులతో కూడిన లైబ్రరీ పారిశ్రామిక ప్రాంతంలో లేదని అవేదన వ్యక్తం చేశారు.
సింగరేణి సంస్థ ప్రభుత్వం కలిసి పారిశ్రామిక ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీని అన్ని వసతులతో కూడిన భవంతిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. రామగుండం ఎమ్మెల్యే, ఆర్జీ.వన్ జీఎం చొరవ తీసుకొని వెంటనే సింగరేణి సిఎస్ఆర్ నిధులనుండి నూతన లైబ్రరీని వెంటనే నిర్మించాలన్నారు. లేనిపక్షంలో నిరుద్యోగ యువతతో జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి సురేందర్, రాణవేణి సుధీర్ కుమార్, పోతరాజు నాగరాజు నాగరాజు, వినయ్, సాయి పాల్గొన్నారు.