పెద్దపల్లి, సెప్టెంబర్ 23: వానాకాలం 2025 సీజన్ ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు వ్యవసాయ శాఖ పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. సన్న రకం ధాన్యానికి కనీసం మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని వెల్లడించారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ వరి కోతలు క్రమ పద్ధతిన జరిగేలా చూడాలని, కోతల సమయంలో హార్వెస్టర్లు 18 కంటే ఎక్కువ ఆర్పీఎం నడిచేలా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ తగ్గించేందుకు రైతుకు టోకెన్లు ఇచ్చి క్రమ పద్ధతిలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్టీవో రంగారావు, సీఐ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.