కోల్ సిటీ, మార్చి 4 : రామగుండం బల్దియాకు ఆస్తి పన్ను ఫీవర్ పట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా మూడు వారాల గడువే ఉంది. ఈలోగా మొండి బకాయిల వసూలు సాధ్యమవుతుందా అన్న సందిగ్ధత నెలకొంది. రైల్వే శాఖ నుంచి ఈ ఏడాది పన్ను చెల్లింపునలకు ఆటంకం రావడంతో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరుతుందా? అన్నదే అధికార వర్గాలను వేధిస్తోంది. ఈ యేడాది కార్పొరేషన్ కు రూ.19.74 కోట్ల ఆస్తి పన్ను లక్ష్యంగా ఉంది. ఇందులో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.12.33 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.7.40 కోట్లు, రామగుండం రైల్వే నుంచి రూ.33 లక్షలు వసూలు కావల్సి ఉంది.
ఐతే రైల్వే బోర్డు బడ్జెట్ సమావేశంలో బల్దియాకు చెల్లించాల్సిన పన్ను లెక్కల గురించి ప్రతిపాదించాకే చెల్లిస్తామని చెప్పడంతో వాటికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 28 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా ఇప్పటివరకు కేవలం 8 సంస్థలు మాత్రమే బల్దియాకు పన్నులు చెల్లించాయి. మరో 20 సంస్థల నుంచి ఈ మూడు వారాల్లో వసూళ్లు కష్టంగానే కనిపిస్తోంది. ఎన్ పి డీసీఎల్ పరిధి పీకే రామయ్య కాలనీ సబ్ స్టేషన్ నుంచి రూ.4.90 లక్షలు, అల్లూరు నుంచి రూ.4.89 లక్షలు, గౌతమినగర్ నుంచి రూ.4.77 లక్షలు, గోదావరిఖని సబ్ స్టేషన్ నుంచి రూ.1.11 లక్షలు, శారదానగర్ నుంచి రూ.1.10 లక్షలు, జనగామ సబ్ స్టేషన్ నుంచి రూ.3.55 లక్షలు వసూలు కావల్సి ఉంది.
మొత్తంగా రూ.19.74 కోట్ల పన్నుల వసూలు లక్ష్యంకు ఇప్పటివరకు శ్రమించగా కేవలం రూ.13.03 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. వీటిలో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.6.83 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.6.19 కోట్లు వసూలు కావల్సి ఉంది. అలాగే ట్రేడ్ లైసెన్సు రూపేణా రూ.76.25 లక్షల వసూలు లక్ష్యంగా ఉంది. కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 4,400 దుకాణాలు ఉండగా వీటి ద్వారా ఇప్పటివరకు రూ.40.83 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు.
కాగా బల్దియాకు ఆస్తి పన్ను వసూళ్లలో కీలకంగా వ్యవహరించే ఆర్.ఐ శంకర్ రావు ఇటీవలనే పదవీ విరమణ పొందడం కూడా వెలితిగా భావిస్తున్నారు. ఆస్తి పన్ను వసూలు లక్ష్యం నెరవేరాలంటే ఆయన సేవలను మరో 2 నెలల పాటు వినియోగించుకోవాలని బల్దియా యోచిస్తోంది. ఇదే విషయంను పదవీ విరమణ రోజున కూడా అభ్యర్థించింది. ఏదిఏమైనా ఈ మూడు వారాల్లో లక్ష్యం నెరవేరుతుందా? అన్న ఫీవర్ మొదలైంది.