Nirmal Purja : నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ నిమ్స్‌దాయ్ పుర్జా (43) మరణించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పరిధి కారాకోరం రేంజ్‌లోని, బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం కారణంగా అతడు మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. నిర్మల్ పుర్జాతోపాటు మరో తొమ్మిది మంది కలిసి బ్రాడ్ పీక్ పర్వతారోహణకు బయల్దేరారు. మొత్తం 10 సభ్యులున్న ఈ బృందానికి పుర్జానే నాయకత్వం వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం పర్వతంపై హిమపాతం సంభవించింది.
మంచు పర్వతం కూలిపోవడం, మంచు కూరుకుపోవడం వల్ల వీళ్లు అందులో చిక్కుకుపోయారు. దీంతో గురువారం నుంచి వీరి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. దీంతో వారు ఏమయ్యారు అనే సందేహాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వారిని రక్షించే సహాయక చర్యలు కొనసాగాయి. పాకిస్తాన్‌కు చెందిన అల్పైన్ క్లబ్ ఆధ్వర్యంలో, హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యల్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పుర్జా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అలాగే, మిగతా వారిలో కూడా మరో ఐదుగురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. వారి మృతదేహాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పది మంది బృందంలో ఆరుగురు నేపాల్‌కు చెందిన వారు. మిగిలిన వారిలో పాకిస్తాన్, ఒమన్, యూఎస్, చైనా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
పాకిస్తాన్‌కు చెందిన సోహైల్ సాఖి కూడా ఈ బృందంలో ఉన్నారు. నిర్మల్ పుర్జా ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన పర్వతారోహకుల్లో ఒకరు. ఆయన గతంలో బ్రిటిష్ స్పెషల్ ఫోర్స్‌లో కూడా పని చేశారు. 2019లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తు.. అంటే 8,000 మీటర్లకంటే ఎక్కువ ఎత్తున్న 14 పర్వతాల్ని ఆరు నెలల కాల వ్యవధిలోనే అధిరోహించారు. ఇదో అరుదైన రికార్డ్. ఆయనపై నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. 2012లోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించాడు.