బూర్గంపహాడ్, ఆగస్టు 01 : గోదావరి వరదల నేపధ్యంలో బూర్గంపహాడ్ మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. ముందుగా సారపాకలోని బసప్పక్యాంప్, భాస్కర్నగర్ ఎస్టీ కాలనీ, పాత సారపాక ప్రాంతాలతో పాటు బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. వరదల నేపధ్యంలో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని, బాధితులు పునరావాస కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సారపాకలో సర్పంచ్ కిషోర్ నాయక్తో పాటు అధికారులు పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారన్నారు. వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముంపు ప్రాంతాల బాధితులకు త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎంపీఓ రామకృష్ణ, ఎస్ఐ మేడా ప్రసాద్, సర్పంచ్ కిశోర్నాయక్, ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్, సెక్రటరీ గుగులోత్ రవికుమార్ పాల్గొన్నారు.