– ప్రస్తుతం 28 అడుగుల నీటిమట్టం
– డబుల్బెడ్రూం ఇళ్లల్లోకి చేరిన నీరు
దుమ్ముగూడెం, ఆగస్టు 01 : దుమ్ముగూడెం మండల కేంద్రంలో హెడ్‌లాకుల వద్ద గోదావరి వరద శనివారం మధ్యాహ్నం నుండి తగ్గుముఖం పట్టింది. వరద నీరు 30 అడుగులకు చేరుకున్న అనంతరం కొద్దిసేపు నిలకడగా ఉండి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రెండు అడుగులు తగ్గి 28 అడుగుల వద్ద ఉంది. సాయంత్రానికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఉదయం వరకు తూరుబాక వద్ద భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా గంగోలు గ్రామంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి గోదావరి వరద చేరింది. కాగా సున్నంబట్టి, ప్రగళ్లపల్లి రహదారిపై, పర్ణశాల రామాలయానికి వెళ్లే మార్గాల్లో రహదారులపై ఇంకా వరద నీరు నిలిచే ఉంది.
సీతా కుటీరం నీట మునిగే ఉంది. అలాగే కొందరు ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్ణశాల వద్ద వరద ఉదృతిని డీఎల్పీవో సుదీర్‌కుమార్, గ్రామ సర్పంచ్ ఖాదర్‌బాబు, సెక్రటరీలతో కలిసి పరిశీలించారు. ఈ సమయంలో బోటు మీద పర్ణశాల గ్రామస్తులను తరలించే సమయంలో లైఫ్ జాకెట్లు ఉపయోగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీఓ వివేక్‌రావు, సీఐ వెంకటప్పయ్య, ఎంపీఓ, పంచాయతీ సర్పంచ్, సెక్రటరీలు పాల్గొన్నారు.