పెద్దపల్లి టౌన్, జూన్ 4: హార్వెస్టర్ కొనుగోలు చేసి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని అనుకుంటే ఆ రైతుకు పెద్ద నష్టమే వచ్చింది. కొనుగోలు చేసిన ఆరు నెలల్లోనే ఎనిమిది సార్లు రిపేర్‌కు వచ్చింది. కొత్తదే కదా.. ఇన్నిసార్లు రిపేర్‌కు రావడమేంటని ప్రశ్నిస్తే.. షోరూం యజమాని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ రైతు జాన్‌డీర్ షోరూంకి తాళం వేసి నిరసన తెలిపాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన పెసరు పెద్దలు అనే రైతు రంగంపల్లి ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని జాన్‌డీర్ షోరూంలో ఆరు నెలల క్రితం రూ.35 లక్షలు వెచ్చించి ఓ హార్వెస్టర్‌ను కొనుగోలు చేశాడు. హార్వెస్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. హార్వెస్టర్ కొనుగోలుచేసిన ఆరు నెలల్లోనే ఎనిమిది సార్లు రిపేర్‌కు వచ్చింది. రిపేర్‌కు వచ్చిన ప్రతిసారి రూ.40వేల చొప్పున మొత్తంగా నాలుగు లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ హార్వెస్టర్ సమస్య తీరలేదు. తాజాగా మరోసారి రిపేర్‌కు రావడంతో పెసలు పెద్దలు బుధవారం షోరూంకు తీసుకొచ్చాడు. తన సమస్యను చెబితే షోరూం యజమాని శేఖర్, సిబ్బంది సూపర్వైజర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ అతన్ని పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పెసరు పెద్దలు.. షోరూం యజమానితో వాగ్వాదానికి దిగాడు. దీంతో పెసరు పెద్దలు తోటి రైతుల సహాయంతో షోరూంకి తాళం వేసి నిరసన తెలిపాడు. ఈ షోరూంలో హార్వెస్టర్ కొనుగోలు చేసి నష్టపోయానని.. తనలాగే మరో రైతు మోసపోవద్దనే ఉద్దేశంతోనే జాన్‌డీర్ షోరూంకి తాళం వేసి నిరసన తెలిపినట్లు పెసరు పెద్దలు తెలిపారు.